రామ్ చరణ్ సినిమా కోసం గట్టిగా సెట్ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. తన తొలి సినిమా ఉప్పెన కోసం ఎలాగైతే మంచి టెక్నీషియన్స్ ను తీసుకున్నాడో.. చరణ్ సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ గా ది గ్రేట్ రెహ్మాన్ ను తీసుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఏకాంబరం ను ఎంపిక చేశాడు.
తమిళ్ లో పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశాడు ఏకాంబరం. రీసెంట్ గా వచ్చిన తంగలాన్ సినిమాకు కూడా ఇతడే డిజైనర్ గా వర్క్ చేశాడు. ఆ సినిమాలో అతడి దుస్తులు, డిజైన్లకు మంచి పేరొచ్చింది. అదే అతడికి రామ్ చరణ్ సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది.
రామ్ చరణ్ సినిమా కూడా పీరియాడిక్ మూవీనే. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ. అప్పటి వాతావరణానికి తగ్గట్టు దుస్తుల్ని తయారు చేయాల్సి ఉంది. కాస్త క్లిష్టమైన పని కావడంతో.. ఎంతోమంది పేర్లు పరిశీలించి ఫైనల్ గా ఏకాంబరంకు అవకాశం ఇచ్చాడు బుచ్చిబాబు.
ప్రస్తుతం ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు చరణ్. ఇటు బుచ్చిబాబు ప్రీ-ప్రొడక్షన్ పనుల్ని కొలిక్కి తీసుకొస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.