ఊహించని విధంగా స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనమ్ కౌర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కార్నర్ చేసింది. తను ఇచ్చిన ఫిర్యాదును ఇప్పటికైనా స్వీకరిస్తారా అని డైరక్ట్ గా ప్రశ్నించింది.
ఈ అంశంపై ‘మా’ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఫిలింఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఏర్పాటుచేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరధ్వాజ… పూనమ్ కౌర్ ఆరోపణలపై స్పందించారు.
పూనమ్ కౌర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎందుకు ఫిర్యాదు చేసిందో.. ఎప్పుడు ఫిర్యాదు చేసిందో ఛాంబర్ కు తెలియదన్నారు తమ్మారెడ్డి. కంప్లయింట్ లేకుండా తాము ముందుకు వెళ్లలేమని, నిజంగా తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే, ముందుకొచ్చి ఛాంబర్ లో కంప్లయింట్ ఇవ్వాలని ఆయన కోరారు.
కనీసం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయినా ముందుకొచ్చి, పూనమ్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదును తమకు ఫార్వర్డ్ చేస్తే, తమ పని తాము చేస్తామని అన్నారు.
ఫిలింఛాంబర్ లో రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓ బాక్స్ పెడతారంట. ఎవరైనా మహిళలు తమపై లైంగిక వేధింపులు జరిగాయని భావిస్తే, ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని ఆయన అన్నారు. డబ్బా మాత్రమే కాకుండా.. వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా లైంగిక వేధింపుల అంశాల్ని ఫిర్యాదు చేయొచ్చన్నారు తమ్మారెడ్డి.