తెలుగులో సినిమా చేసి మిగతా భాషల్లో డబ్ వెర్షన్ రిలీజ్ చేస్తుంటారు మన స్టార్ హీరోలు. కానీ ఎన్టీఆర్ మాత్రం నేరుగా తమిళ్ లో సినిమా చేసి, ఆ తర్వాత దాన్ని తెలుగులో విడుదల చేస్తానంటున్నాడు. కాకపోతే ఓ దర్శకుడు దానికి అంగీకరించాలని చెబుతున్నాడు.
ఎన్టీఆర్ మనసులో ఉన్న ఆ దర్శకుడి పేరు వెట్రిమారన్. వెట్రీ అంగీకరిస్తే నేరుగా తమిళ్ లో ఓ సినిమా చేస్తానని, ఆ తర్వాత దాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తానని ప్రకటించాడు తారక్. దేవర సినిమా తమిళ ప్రమోషన్స్ లో భాగంగా కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆసక్తికర ప్రకటన చేశాడు ఎన్టీఆర్.
దేవర-1కు సంబంధించి ముంబయి ప్రమోషన్స్ ముగించిన ఎన్టీఆర్, ఇప్పుడు చెన్నై ప్రచారం మొదలుపెట్టాడు. ఆల్రెడీ పెద్ద ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఆ తర్వాత మీడియాతో సమావేశమయ్యాడు. ఇతర మీడియా సంస్థలకు కూడా వన్ టు వన్ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు. ఇలా 2 రోజుల పాటు పూర్తిస్థాయిలో తమిళ వెర్షన్ ప్రచారానికి కేటాయించబోతున్నాడు తారక్.
దేవర-1కు పూర్తిస్థాయిలో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఓవర్సీస్ లో ఆల్రెడీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 1.5 మిలియన్ మార్క్ అందుకుంది. తెలుగులో రికార్డ్ స్థాయి బిజినెస్ జరిగింది. హిందీలో మరో సినిమా పోటీలో లేకుండా చూసుకున్నారు. తమిళనాడు కూడా కలిసొస్తే… దేవర-1కు బిగ్గెస్ట్ ఓపెనింగ్ దక్కడం ఖాయం.