
మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. కానీ బాలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో ఎక్కువ పేరు తెచ్చుకొంది. అంతే స్థాయిలో సక్సెస్ పొందింది. ఆమె సంపాదన కూడా తెలుగులో నటించిన తర్వాతే ఎక్కువగా పెరిగింది.
అందుకే, ఆమె ఇప్పుడు తనకి హిందీ, తెలుగు… రెండూ ముఖ్యమే అని చెప్తోంది. బాలీవుడ్, టాలీవుడ్ లో ఇదే మొదటి ప్రాధాన్యం అనేది లేదంటోంది. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగుతుందట.
ప్రస్తుతం ఈ భామ హిందీలో “సన్ ఆఫ్ సర్దార్ 2” సినిమా ప్రమోట్ చేస్తోంది. అజయ్ దేవగణ్ సరసన నటించింది ఇందులో. “పూజ మేరీ జాన్” అనే మరో చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇవి కాకుండా బాలీవుడ్ లో మరో రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలా బాలీవుడ్ లో బిజీగా ఉంది.
తెలుగులో అడివి శేష్ సరసన “డెకాయిట్” చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా కూడా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది. ఇక అన్నింటికీ మించి అల్లు అర్జున్ సరసన బడా సినిమా లాగేసుకొంది. అట్లీ తీస్తున్న సినిమాలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది ఈ భామ. ఇలా తెలుగులో బడా సినిమాలు వస్తుండడంతో కేవలం బాలీవుడ్ అనో, టాలీవుడ్ అనో చెప్పలేను అని చెప్తోంది.

హిందీ చిత్రసీమ వల్లే తనకి బ్రేక్ వచ్చింది, తెలుగు వల్ల లాభం దక్కింది. సో, రెండింటిపై కృతజ్ఞతాభావం ఉంది అని చెప్తోంది ఈ అందాల సుందరి.















