సినిమా కష్టాలు అనే పదం ఊరికే పుట్టలేదు. ప్రతి సినిమా వెనక ఎన్నో కష్టాలుంటాయి. అలాంటి ఓ కష్టాన్ని బయటపెట్టాడు దర్శక-నిర్మాత వైవీఎస్ చౌదరి. రామ్ ను హీరోగా పరిచయం చేసిన “దేవదాసు” సినిమా మేటర్ ఇది.
“రామ్ మీద ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. దేవదాసు రిలీజ్ రోజున 10 కోట్లు పోయాయని ఫిక్స్ అయిపోయాను. నా ఆస్తులు తాకట్టుపెట్టి సినిమా తీశాను. జనాలు లేకపోయినా ఉన్నట్టు భ్రమింపజేసి మాట్లాడాను. హిట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ మాట్లాడేవాడ్ని,” అంటూ పాత విషయాలను బయట పెట్టారు వై.వి.ఎస్. చౌదరి మాట్లాడారు.
“జనవరి 11న దేవదాసు రిలీజైంది. 12న నా నెత్తిమీద స్టయిల్ పడింది. చిరంజీవి, నాగ్ ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమా అది. దెబ్బకు దేవదాసు పడుకుంది. 13న సిద్దార్థ్ నటించిన చుక్కల్లో చంద్రుడు వచ్చింది. అప్పటికి అతడు యూత్ ఫేవరెట్. యూత్ అంతా అటు వెళ్లిపోయారు. నా థియేటర్ దగ్గర జనాల్లేరు. ఇక 13న లక్ష్మి పడింది. అది పక్కా పొంగల్ సినిమా. దీంతో దేవదాస్ థియేటర్ల దగ్గర ఎవ్వరూ లేరు. మొత్తం ఖాళీ. తప్పనిసరి పరిస్థితుల్లో అతి తక్కువ రేటుకు జీ తెలుగు ఛానెల్ కు శాటిలైట్ అమ్మేశాను. ఆ డబ్బులతో 4 వారాలు స్టేట్ అంతా తిరిగాను. 4 వారాల తర్వాత దేవదాసు పికప్ అయింది. 17 సెంటర్లలో 175 రోజులాడింది,” అని చెప్పుకొచ్చారు.
“దేవదాసు” మాత్రమే కాకుండా.. తన సినిమాలన్నీ ఎంతో కష్టపడితే హిట్టయ్యాయని చెప్పుకొచ్చాడు వైవీఎస్. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ దర్శకుడు మరోసారి సినిమా ఎనౌన్స్ చేశారు.
నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీ రామారావుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా తీయనున్నారు వై.వి.ఎస్.