బోయపాటి తదుపరి చిత్రాన్ని తమ సంస్థ నిర్మిస్తుంది అని ఆ మధ్య ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఘనంగా ప్రకటించారు. అంతే కాదు, “అఖండ 2″గా అది ఉంటుంది అని లీకులు ఇచ్చారు. కానీ అది ఇప్పుడు వర్కవుట్ కాలేదు. బోయపాటి తదుపరి చిత్రంలో బాలయ్యే హీరో, కానీ నిర్మాతలు వేరు. “లెజెండ్” సినిమా నిర్మాణంలో భాగస్వాములు అయిన రామ్ ఆచంట, గోపి ఆచంట బాలయ్య, బోయపాటి సినిమాని నిర్మిస్తున్నారు.
దీని వెనుక పెద్ద కథ ఉంది.
బోయపాటితో సినిమా చేస్తానని అల్లు అర్జున్ ఆ దర్శకుడికి మాట ఇచ్చారు. “స్కంద” దారుణ పరాజయం తరువాత లెక్కలు మారాయి. దానికితోడు, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కావడంతో బోయపాటితో ఇప్పుడు ఆ సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఐతే, అల్లు అరవింద్ మరో ప్రపోజల్ పెట్టారు. మా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే బాలయ్యతో సినిమా చేద్దాం, అల్లు అర్జున్ తో ఇప్పుడు కాదు అని. దానికి బోయపాటి ఒప్పుకున్నారు.
ఐతే, బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో ఎదో సినిమా కాకుండా “అఖండ 2” చేస్తే క్రేజ్ వేరుగా ఉంటుంది అని అల్లు అరవింద్, సహ నిర్మాత బన్నీ వాసు లెక్కలేశారు. కానీ “అఖండ” నిర్మాత వేరే సంస్థతో చేతులు కలిపేందుకు ఒప్పుకోలేదు. అలాగే, బాలయ్య కూతురు కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యం కావాలని కోరారు.
దాంతో, ఎన్నికల ఫలితాల తర్వాత బాలయ్య “లెజెండ్” నిర్మాతలకు ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. బాలయ్య కూతురు తేజస్విని సినిమాని సమర్పిస్తున్నారు.
అల్లు అరవింద్ – బాలయ్య సినిమా ప్లాన్ పక్కకు వెళ్ళింది. బోయపాటి కూడా గీతా కాంపౌండ్ నుంచి బయటికి వచ్చారు. ఎన్నికల ఫలితాలు చాలా మార్పులు తెచ్చాయి.