![Y Ravishankar - Pushpa 2](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/08/ravishankar-pushpa2.jpg)
ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవాళ్లు. ప్రకృతి సంపదని కొల్లగొట్టే వారి భరతం పట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు చెట్లని నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలను హీరోయిజంగా చూపిస్తున్నారు,” అని ఇటీవల నటుడు, ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్ చర్చకు దారితీసింది. ఎందుకంటే “పుష్ప” సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘పుష్పరాజ్’ పాత్ర అలాంటిదే.
ఇంతకుముందు విడుదలైన ‘పుష్ప’, రాబోయే ‘పుష్ప 2’ చిత్రాల్లో హీరో అల్లు అర్జున్ పాత్ర ఎర్ర చందనం స్మగ్లర్ ది. దాంతో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు అని రచ్చ జరిగింది. దానికి తోడు ఇటీవల జనసేన పార్టీ నాయకులు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
అల్లు అర్జున్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా నేతకి మద్దతుగా కర్నూలు వెళ్లారు. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ – చిరంజీవి కుటుంబానికి – అల్లు అర్జున్ కుటుంబానికి దూరం పెరిగింది. దానికితోడు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కూటమి నేతలు బన్నీని టార్గెట్ చేశారు.
ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ సినిమా విడుదలకు సమస్యలు రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి అడిగినప్పుడు ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతల్లో ఒకరైన నిర్మాత రవిశంకర్ స్పందించారు.
“నేను ఇటీవల పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఆయన చేసిన కామెంట్ మా ‘పుష్ప’ సినిమా గురించి కాదు. పవన్ కళ్యాణ్ ఎవరి సినిమాని టార్గెట్ చెయ్యరు. ఇక పవన్ కళ్యాణ్ తో మేం నిర్మిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది,” అని రవి అన్నారు.