సీరియల్స్ లో పాపులర్ అయిన తారలు చాలా కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్లలో ఒకరు పవిత్ర జయరాం. త్రినయిని, నిన్నే పెళ్లాడతా లాంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర జయరాం హఠాత్తుగా కన్నుమూశారు.
హైదరాబాద్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే కన్నుమూశారు. షూటింగ్ నిమిత్తం 3 రోజుల కిందట ఆమె బెంగళూరు వెళ్లారు. మరో షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మహబూబ్ నగర్ జిల్లా శేరిపల్లి వల్ల ప్రమాదానికి గురైంది.
ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి, ఎదురుగా వస్తున్న బస్సును కూడా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో పవిత్ర జయరాం అక్కడిక్కడే మృతి చెందగా.. ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యారు.
కర్నాటకలోని మండ్యా ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా బుల్లితెరపైకొచ్చారు. జోకలి అనే సీరియల్‍తో ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపటా, రాధారామన్, విద్యావినాయక సహా కన్నడలో 10కి పైగా సీరియల్స్ చేశారు.
నిన్నే పెళ్లాడతా అనే సీరియల్‍తో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. ప్రస్తుతం జీ తెలుగు సీరియల్‍లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్‍తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్‍లో నెగెటివ్ రోల్ అయిన తిలోత్తమ పాత్రను పవిత్ర జయరాం పోషిస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు. దీంతో తిలోత్తమగా పవిత్ర జయరాం బాగా ఫేమస్ అయ్యారు. అంతలోనే హఠాన్మరణం చెందారు.