
తిరువీర్ ఇటీవల కొంచెం పాపులర్ అయ్యాడు. రానా హీరోగా నటించిన “ఘాజి”లో చిన్న పాత్రతో మొదటిసారి ప్రేక్షకుల దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత మల్లేశం, జార్జిరెడ్డి, టక్ జగదీష్, పలాస చిత్రాల్లో సైడ్ రోల్స్ చేశాడు. అలా చిన్న చిన్న పాత్రలతో కష్టపడుతున్న ఈ కుర్ర హీరోకు “మాసూద” అనే హారర్ చిత్రం మంచి బ్రేక్ ఇచ్చింది.
ఆ సినిమా విజయం సాధించడంతో హీరోగా చిన్న చిత్రాల్లో అవకాశాలు పెరిగాయి. “పరేషాన్” కూడా గుర్తింపు తెచ్చింది. దాంతో, మూడు, నాలుగు చిత్రాల్లో హీరోగా బుక్ చేస్తూ నిర్మాతలు డబ్బులు, అడ్వాన్స్ లు ఇచ్చారు. కొన్ని సెట్స్ పై ఉన్నాయి. కొన్ని ఇంకా మొదలు కాలేదు. కానీ ఈ డబ్బులతో సొంత ఊళ్ళో ఇల్లు కట్టాడు.
సొంత ఇల్లు కట్టుకోవాలన్న అమ్మ కల నెరవేరింది అని తిరువీరు ఎమోషనల్ గా పోస్టులు పెట్టాడు. “రెండు దశాబ్దాల కల, అమ్మ చివరి కోరిక,” అని గృహప్రవేశం ఫోటోలు షేర్ చేశాడు.
భార్యతో కలిసి గృహప్రవేశం చేశాడు. రంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందిన తిరువీర్ గతేడాది పెళ్లి చేసుకున్నాడు.