‘తండేల్’ సంగతేంటి..? సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న ప్రశ్న ఇది. క్రిస్మస్ కు వస్తామని చెప్పిన మేకర్స్ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. పూర్తిగా మీడియాకు ముఖం చాటేశారు. సినిమా రిలీజ్ సంగతి దేవుడెరుగు, కనీసం షూటింగ్ అప్ డేట్ అయినా వస్తే అదే చాలనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఎట్టకేలకు ‘తండేల్’ నుంచి అప్ డేట్ వచ్చింది. మరో 10 రోజుల్లో టోటల్ సినిమా పూర్తవుతుందని దర్శకుడు చందు మొండేటి ప్రకటించాడు. ఈరోజు ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన చందు.. సినిమా రిలీజ్ పై స్పష్టత ఇవ్వలేకపోయాడు.
రామ్ చరణ్ సినిమా లైన్లో ఉంది కాబట్టి సంక్రాంతికి రావాలా వద్దా అనే ఆలోచనలో అల్లు అరవింద్ ఉన్నారని.. అదే విధంగా వెంకటేశ్ సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, నాగచైతన్యలో కూడా డైలమా ఉందని అన్నాడు చందు. మొత్తానికి సంక్రాంతికి రావట్లేదనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు.
ఇటు నాగచైతన్య కూడా ‘తండేల్’ రిలీజ్ మేటర్ ను అల్లు అరవింద్ పైకి నెట్టేశాడు. ‘క’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన చైతూ.. తమ నిర్మాత అల్లు అరవింద్, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మాత్రమే అన్నాడు.
నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది ‘తండేల్’. సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.