
‘పుష్ప-2’ విషయంలో తమన్ కు ఎంత అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను కాదని తనకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యత అప్పగించారని, ‘పుష్ప-2’ కు తనే బీజీఎం ఇచ్చానని విడుదలకు ముందు గొప్పగా చెప్పుకున్నాడు తమన్.
కట్ చేస్తే, సినిమా రిలీజైన తర్వాత తమన్ కు టైటిల్స్ క్రెడిట్ ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే, తమన్ వర్క్ ను అస్సలు వాడుకోలేదు. సామ్ సీఎస్ కంపోజ్ చేసిన స్కోర్ తో పాటు, దేవిశ్రీ అందించిన స్కోర్ నే ఉపయోగించారు.
దీనిపై చాన్నాళ్ల పాటు మౌనం వహించిన తమన్, ఎట్టకేలకు స్పందించాడు.
‘పుష్ప-2’ కు 10 రోజుల పాటు కష్టపడి 3 వెర్షన్ల బీజీఎం అందించానని, కానీ మేకర్స్ అందులోంచి ఒకటి కూడా వాడుకోలేదని అన్నాడు. ఈ విషయంలో తను కొంత బాధపడ్డానని, అయితే అందరి అంగీకారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు.
‘పుష్ప-2’ కోసం తన వర్క్ వాడడం లేదనే విషయాన్ని విడుదలకు ముందే తమన్ కు సమాచారం అందించారట. దానికి తమన్ అంగీకరించినట్టు తెలిపాడు. ఈ సినిమాలో తమన్ వర్క్ ను వాడుకోనప్పటికీ, అతడికి భారీగా రెమ్యూనరేషన్ ముట్టజెప్పారు.