“ఇకపైన తెలంగాణాలో బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్ రేట్లు పెంచబోము.”
అలా అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడంతో ముఖ్యమంత్రి అలా తెలిపారు. అల్లు అర్జున్ పై కేసు పెట్టి ఒక రోజు జైలులో కూడా ఉంచారు.
ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ “పెద్దలు” వెళ్లి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చలు జరిపారు. ఆ సమయంలో “తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్” బాధ్యతలు తీసుకున్న దిల్ రాజు ముందుండి ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య “వారధి” అయ్యారు. అప్పుడే టికెట్ రేట్ల పెంపు గురించి ముఖ్యమంత్రితో మాట్లాడారా అని మీడియా అడిగింది.
“టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు అసలు ఇంపార్టెంటే కాదు. అది చాలా చిన్న అంశం,” అని దిల్ రాజు అన్నారు. ఆ చిన్నఅంశం కోసం దిల్ రాజు పెద్ద ప్రయత్నం చేసి మొత్తానికి ఇప్పుడు రేట్లు పెంచేలా చేశారు.
అవును, “గేమ్ ఛేంజర్” సినిమాకి టికెట్ రేట్లను పెంచింది తెలంగాణ ప్రభుత్వం. మొదటి రోజు మల్టిప్లెక్స్ లో 150, సింగిల్ థియేటర్లో 100 రూపాయలు అదనంగా వసూలు చేసేందుకు అంగీకరించింది. మొదటి రోజు ఆరు ఆటలకు అనుమంతించింది. కేవలం “బెనిఫిట్ షో” మాత్రం అనుమతి ఇవ్వలేదు.
అటు రేవంత్ రెడ్డి మాట తూచ్ అన్నట్లు అయింది.