
చాలామంది సెలబ్రిటీలు కుంభమేళాకు వెళ్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కూడా వెళ్లి పుణ్యస్నానం చేసొచ్చారు. ఇప్పుడు తమన్న కూడా వెళ్తోంది. అయితే ఆమె వెళ్తోంది కేవలం త్రివేణి సంగమంలో పుణ్యం స్నానం చేయడానికి మాత్రమే కాదు, పనిలో పనిగా తన సినిమాకు ప్రచారం చేసుకోవడానికి కూడా.
మిల్కీ బ్యూటీ లీడ్ రోల్ లో అశోక్ తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఓదెల 2’. 2021లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు సీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి తమన్న ఫస్ట్ లుక్ ఇదివరకే రిలీజైంది. ఇందులో ఆమె నాగ సాధు పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు టీజర్ రెడీ అయింది.
ఈ సినిమా టీజర్ ను 22న కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేయనున్నారు. కాశీ మహా కుంభమేళాలో లాంచ్ చేస్తున్న మొట్టమొదటి సినిమా టీజర్ ‘ఓదెల 2’ కావడం విశేషం. ఈ సందర్భంగా మేకర్స్ తమన్న నుంచి మరో లుక్ ను కూడా రిలీజ్ చేశారు.
సంపత్ నంది క్రియేట్ చేసిన ఈ కథకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాధ్ సంగీతం అందిస్తున్నాడు. హెబ్బా పటేల్, వశిష్ట సింహ, నాగ మహేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.