
దర్శకులు అప్పుడప్పుడు నటులుగా మారడం కొత్తేం కాదు. ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి ఇప్పటితరం రాజమౌళి వరకు చాలామంది సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ఎస్ జే సూర్య లాంటి దర్శకులైతే పూర్తిగా డైరక్షన్ పక్కనపెట్టి నటనకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో అనీల్ రావిపూడిపై అందరి దృష్టి ఉంది.
అతడిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఎప్పటికైనా నటుడిగా మారతాడని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు అనీల్ రావిపూడితో పాటు, నిర్మాత దిల్ రాజు కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఇలా అంతా రావిపూడి గురించి మాట్లాడుకుంటున్న టైమ్ లో మరో దర్శకుడు ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయిపోయాడు.
అతడే హరీశ్ శంకర్. ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాలతో పాపులరైన ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడు. సుహాస్ హీరోగా నటిస్తున్న “ఓ భామ అయ్యో రామ” అనే సినిమాలో హరీశ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
నిజానికి హరీశ్ శంకర్ కు యాక్టింగ్ కొత్త కాదు. తరుణ్ హీరోగా నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమాలో చిన్న క్యామియో చేసిన హరీశ్.. ఆ తర్వాత ‘నిప్పు’, ‘నేనింతే’ లాంటి సినిమాల్లో కూడా కనిపించాడు. ఈసారి సుహాస్ సినిమాలో కాస్త ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాతో హరీశ్ శంకర్ యాక్టింగ్ కెరీర్ మొదలైనట్టే.