
సినిమాల నేరేషన్లు, సినిమాలు తీసే పద్ధతులు ఇటీవలి కాలంలో పూర్తిగా మారిపోయిన మాట వాస్తవం. పెద్ద హీరోల సినిమాల విషయానికి వస్తే యాక్షన్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. రొమాన్స్ ని పక్కన పెట్టేశారు. అలాగే సీనియర్ హీరోలకు హీరోయిన్లు అవసరమా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దాంతో, రజినీకాంత్, కమల్ హాసన్, బాలయ్య వంటి వాళ్ళు హీరోయిన్ల ట్రాక్ లేకుండానే సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఐతే, అలాంటి సీనియర్ హీరోల చిత్రాలైనా, అల్లు అర్జున్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో అయినా ఐటెం సాంగ్స్ మాత్రం తప్పనిసరిగా మారుతోంది. ఆ మధ్య ఐటెం సాంగ్స్ ని పక్కన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రెండ్ ఊపందుకొంది.
తమన్న

తమన్న చాలా సినిమాల్లో ఐటెంగాళ్ గా మారిపోయింది. “జైలర్” సినిమాలో ఆమె చేసిన “కావాలయ్యా” పాట సెన్సేషన్ అయింది. ఇక “స్త్రీ 2” సినిమాలో “ఆజ్ కి రాత్” (Aaj Ki Raat) పాటలో ఆమె డ్యాన్స్ కిరాక్ పుట్టించింది. ఈ పాట ఏకంగా 70 కోట్ల వ్యూస్ అందుకొంది. గతేడాది ఆమె ఏకంగా మూడు హిందీ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
శ్రీలీల

శ్రీలీల అద్భుతమైన డ్యాన్సర్. ఆమె డ్యాన్స్ కున్న క్రేజ్ ఏంటో “పుష్ప 2” చూపించింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ “కిస్సిక్” హిందీలో బాగా క్లిక్ అయింది. అందుకే, శ్రీలీలకు ఇప్పుడు బాలీవుడ్ లో హీరోయిన్ గా అవకాశాలు పెరిగాయి. ఆమె చేసిన మొదటి ఐటెం సాంగ్ వల్ల ఆమెకి బాలీవుడ్ లో కెరీర్ ఏర్పడింది అంటే ఐటెం సాంగ్స్ కున్న క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది కదా.
పూజ హెగ్డే
పూజ హెగ్డే ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్. రెండు, మూడేళ్ళ క్రితం వరకు ఆమెకి మన దగ్గర టాప్ పొజిషన్ ఉండేది. ఇప్పుడు ఆమెకి అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో, తమిళ చిత్రసీమ ఫోకస్ పెట్టి అక్కడ రెండు భారీ చిత్రాలు లాగేసుకొంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ సినిమాలో ఆమెకి ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. “కూలీ” చిత్రంలో పూజ స్పెషల్ సాంగ్ చూడబోతున్నాం.

ఇంతకుముందు ఈ భామ “ఎఫ్ 2″లో అలా మెరిసింది. “కూలీ” ఆమెకి రెండో ఐటెం సాంగ్ కానుంది.
కేతిక శర్మ
కేతిక శర్మ కూడా ఈ రూట్లోకి వచ్చింది. త్వరలో విడుదల కానున్న నితిన్ కొత్త సినిమా “రాబిన్ హూడ్” చిత్రంలో ఆమె ఒక ఐటెం సాంగ్ చేసింది. ఆమెకి ఇదే ఫస్ట్ ఐటెం సాంగ్. “మ్యాడ్ స్క్వేర్” అనే సినిమాలో రెబా మోనిక కూడా “స్వాతి రెడ్డి” అనే ఐటెం గాళ్ గా కనిపించనుంది.

మొత్తమ్మీద మళ్లీ పేరొందిన హీరోయిన్లతో ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ ఊపందుకుంటోంది.