అంగరంగ వైభవంగా జరిగింది అనంత్ అంబానీ పెళ్లి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తారలు క్యూ కట్టారు. ఆ మాటకొస్తే హాలీవుడ్ నుంచి కూడా కొంతమంది పెళ్లిలో కనిపించారు. ఓవైపు ఇంత హడావుడి జరుగుతుంటే, మరోవైపు కొంతమంది తారలు మాత్రం ఈ పెళ్లికి డుమ్మా కొట్టారు.
వీళ్లలో తాప్సి, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సైఫ్ అలీఖాన్ లాంటి ప్రముఖులున్నారు. వీళ్లు వివాహానికి వెళ్లకపోవడం వాళ్ల వ్యక్తిగతం. వీళ్లలో తాప్సి మాత్రం తన గైర్హాజరీపై స్పందించింది. అక్కడ తనకు ఎవ్వరూ తెలియరని, అందుకే పెళ్లికి వెళ్లలేదని వ్యాఖ్యానించింది.
రీసెంట్ గా ఓ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సి తనదైన శైలిలో రియాక్ట్ అయింది. “వాళ్లు (అంబానీలు) నాకు వ్యక్తిగతంగా తెలియదు. వివాహం అనేది పూర్తిగా వ్యక్తిగత సంబరం. అలాంటి వేడుకకు హాజరైనప్పుడు ఆ కుటుంబానికి మనకు మధ్య మినిమం కమ్యూనికేషన్ ఉండాలి కదా. అది లేనప్పుడు పెళ్లికి వెళ్లి ఏం చేస్తాం?”
నిజానికి ఆ వివాహానికి హాజరైన చాలామంది నటీనటులకు అంబానీ కుటుంబంతో నేరుగా సంబంధం లేదు. ఆహ్వానం అందింది కాబట్టి వెళ్లి వచ్చారు. విలువైన బహుమతులు కూడా అందుకున్నారు. తాప్సి మాత్రం వెళ్లలేదు. తనకు అంబానీ ఫ్యామిలీ నుంచి ఆహ్వానం అందిందా లేదా అనే విషయాన్ని మాత్రం తాప్సి చెప్పలేదు.