కాంగ్రెస్ పార్టీ … బీజేపీకి బద్ద వ్యతిరేకి. ఎన్డీయేని దించేసి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కీలకంగా ఉన్న ఇండి అలయెన్స్ ప్రకటనలు చేస్తోంది. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది.
కానీ, ఈ రెండు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు, వీరి కార్యకర్తలు, నేతలు, హీరోలు, సానుభూతిపరులు “తామంతా ఒకటిగా”నే కలిసిపోయారు. మంచి స్నేహం, అనుబంధంతో “రెండు రాష్ట్రాల ప్రగతి” కోసం పనిచేస్తున్నారు.
అందుకే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కూటమి తరఫున ప్రచారం చేసిన హీరో సాయి ధరమ్ తేజ్ … తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉత్సాహంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు ఇటీవల సాయి ధరమ్ తేజ్ చేసిన ఒక మంచి పనికి వేగంగా స్పందించారు. సాయి ధరమ్ తేజ ట్వీట్ తో యూట్యూబర్ ప్రణీత్ ని అరెస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఫన్ పేరుతో తండ్రి, కూతుళ్ళ అనుబంధాన్ని అసభ్యంగా చిత్రికరిస్తూ మాట్లాడిన ప్రణీత్ హనుమంతులాంటి వారిని కఠినంగా శిక్షించాలని ట్విట్ చేశారు సాయి దుర్గ తేజ్. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేసింది. ఇంత వేగంగా ప్రభుత్వం స్పందించడంతో “మెండైన సామజిక స్పృహ” ఉన్న ఈ హీరో ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. చిన్న పిల్లల హక్కులను కాపాడడంలో, సోషల్ మీడియా దుర్వినియోగం అరికట్టడం కోసం గట్టి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసా గొప్ప సంతృప్తి ఇచ్చింది అని తెలిపారు.