మహేష్ బాబు ఇప్పటికే సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతున్నాడు. అంబానీ పెళ్లి వేడుకలో సరికొత్త మేకోవర్ తో ప్రత్యక్షమయ్యాడు మహేష్ బాబు. ఆ స్టిల్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక దశలో అంబానీ పెళ్లి వేడుక కంటే, మహేష్ కొత్త మేకోవర్ ఫొటోలే ట్రెండింగ్ అయ్యాయి.
అలా తన లుక్ తో సంచలనం సృష్టించిన మహేష్, ఈరోజు మరోసారి వైరల్ అయ్యాడు. దీనికి కూడా ఓ కారణం ఉంది. ఈసారి మహేంద్రసింగ్ ధోనీతో కలిశాడు సూపర్ స్టార్. మహేష్-ధోనీ కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
తమతమ రంగాల్లో మహేష్, ధోనీ సాధించిన ఘనతల గురించి అందరికీ తెలిసిందే. కేవలం రికార్డ్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత లక్షణాల్లో కూడా ఇద్దరి మధ్య చాలా పోలికలున్నాయి. ఎటువంటి సందర్భంలోనైనా ఇద్దరూ కూల్ గా ఉంటారు. కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.
అందుకే వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ప్రస్తుతం మహేష్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. దాదాపు ఇదే లుక్ ను రాజమౌళి సినిమాలో కొనసాగించే అవకాశం ఉంది.