ఈమధ్య వీవీ వినాయక్ ను ఎక్కడైనా చూశారా? ఏ ఫంక్షన్ కు ఆయన రావడం లేదు, ఏ కార్యక్రమంలో కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. మరీ ముఖ్యంగా తీవ్రమైన జీర్ణకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారట. దీంతో ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారని టాక్ మొదలైంది. ఇందులో నిజమెంత?
టాలీవుడ్ లో అందరి వాడు అనిపించుకున్నారు వినాయక్. ఆయనకు ఇండస్ట్రీలో శత్రువులంటూ లేరు. అందరూ ఆయన వాళ్లే. ఆయన అందరివాడే. అలాంటి వ్యక్తి కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. ఆమధ్య దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేశారు. షూట్ కూడా మొదలుపెట్టి ఆపేశారు.
కొన్ని రోజుల కిందట చిరంజీవి సినిమాతో వినాయక్ రీఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని కూడా ఆయన ప్రకటించారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. అంతలోనే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ న్యూస్.
ఈ వార్తల్ని వినాయక్ సోదరుడు విజయ్ తోసిపుచ్చారు.అన్నయ్య కొంత కాలం క్రితం చిన్న సమస్యతో ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు అనేది విజయ్ మాట. త్వరలోనే వినాయక్ ఆఫీస్ లో అడుగుపెడతారని అంటున్నాడు. అందరూ అదే కోరుకుంటున్నారు.
“ఆది”, “ఠాగూర్”, “బన్ని” “కృష్ణ” “అదుర్స్” వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు తీసిన వినాయక్ ఒకప్పుడు అగ్ర దర్శకుడు.