“అఖండ 2” ప్రాజెక్టును గ్రాండ్ గా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు బోయపాటి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. అటు బాలకృష్ణ కూడా సినిమా స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఏపీ ఎన్నికల కోసం గ్యాప్ ఇచ్చిన ఈ సీనియర్ హీరో, త్వరలోనే బాబి సినిమా సెట్స్ పైకి వస్తాడు. వీలైనంత తొందరగా ఆ సినిమాను పూర్తిచేస్తాడు.
ఈ గ్యాప్ లో బోయపాటి “అఖండ 2” కథ సిద్ధం చేయాల్సి ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం, అఖండ-2కు సంబంధించి మొదటి డ్రాఫ్ట్ పూర్తిచేశాడట బోయపాటి. బాలయ్యతో చర్చలు జరిపిన తర్వాత, తుది స్క్రిప్ట్ కు పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడు. కెరీర్ లో బాలయ్యకు ఇది 110వ చిత్రం.
బాలయ్య-బోయపాటి కాంబో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇద్దరూ కలిసిన ప్రతిసారి హిట్టిచ్చారు. అలా ఈసారి అఖండ-2తో సక్సెస్ కొట్టాలని బోయపాటి భావిస్తున్నాడు. అతడి గత చిత్రం “స్కంద” బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అందుకే అఖండ-2తో, బాలయ్య అండతో బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకుంటున్నాడు ఈ దర్శకుడు.
ఇక ఈ సినిమాకి నిర్మాత విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో “అఖండ 2” తీయాలనేది అల్లు అరవింద్ భావన. అల్లు అరవింద్ కే బోయపాటి మూవీ చెయ్యాలి. కానీ “అఖండ” నిర్మించిన మిరియాల రవీందర్ రెడ్డి ఈ విషయంలో పేచీ పెడుతున్నట్లు సమాచారం.