ఎన్నో ఆశలతో “స్పై” సినిమా చేసింది ఐశ్వర్య మీనన్. తెలుగులో ఆమెకదే తొలి రిలీజ్. ఆ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో జెండా పాతేద్దాం అనుకుంది. పాపం, ఐశ్వర్య ఆశలు ఫలించలేదు. “స్పై” సినిమా డిజాస్టర్ అయింది. ప్రతి సినిమాకు కష్టపడతామని, ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని చెబుతోంది.
“స్పై సినిమాలో మోడరన్ డ్రెసెస్, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ చేశా. ప్రతి సినిమాను ఇష్టపడే చేస్తాం. కానీ ఫలితం మన చేతుల్లో ఉండదు. నా సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటా. కానీ ఆ ఫలితం ఇచ్చేది ప్రేక్షకులు. వాళ్లకు మూవీ నచ్చాలి. వాళ్లు ఆదరించాలి. అప్పుడే విజయం దక్కుతుంది. స్పై సినిమా విషయంలో నేను అనుకునేది ఇదే. ఆ సినిమా కోసం టీమ్ అంతా శ్రమించారు. కానీ రిజల్ట్ అనుకున్నట్లు రాలేదు. ఒక హీరోయిన్ సినిమా ఫేట్ డిసైడ్ చెయ్యలేదు,” అని చెప్పింది ఐశ్వర్య మీనన్.
ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది ఐశ్వర్య మీనన్.
” స్పై” సినిమా తర్వాత ఆమెకు “భజే వాయు వేగం” సినిమాలో అవకాశం వచ్చిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ తెలుగులో ఈమె ముందుగా సైన్ చేసిన సినిమా “భజే వాయువేగం”. కాకపోతే స్పై సినిమా ముందుగా రిలీజైంది.
“భజే వాయు వేగంలో బ్యూటీషియన్ ఇందుగా నటించాను. ఇది కమర్షియల్ సినిమా అయినా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అలా వచ్చి ఇలా వెళ్లినట్లు నా క్యారెక్టర్ ఉండదు. ఈ సినిమాలో నేను సినిమా చీరకట్టులోనే ఎక్కువగా కనిపిస్తాను. అంతే కాదు, నాకు చీరలు అంటే ఇష్టం. చీరకట్టు నాకు ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది,” అని చెప్పింది ఈ బ్యూటీ.
“తెలుగు ఇండస్ట్రీ అంటే నాకు ఇష్టం. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నా. ప్రస్తుతం మమ్మూట్టి గారితో ఒక మూవీ చేస్తున్నాను,” అని తన కొత్త సినిమాల గురించి తెలిపింది ఐశ్వర్య మీనన్.