
“కృష్ణ అండ్ హీజ్ లీల”.. ఐదేళ్ల కిందట సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా. అప్పట్లో గుర్తింపు కోసం పరితపించేవాడు సిద్ధూ. ఒక్క హిట్ వస్తే చాలనుకున్నాడు. ఎంతో కష్టపడి సినిమా చేశాడు.
కానీ దురదృష్టవశాత్తూ, కొవిడ్ వల్ల ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. అప్పటి తన పెయిన్ ను తాజాగా బయటపెట్టాడు ఈ హీరో.
“జీరోగా ఉన్న రోజుల్లో కష్టపడి పని చేశాం. దానికి అక్కడ సరైన రికగ్నిషన్ దక్కలేదు. థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వలేదని అప్పుడు చాలా హర్ట్ అయ్యాం. ఇప్పుడు మా సినిమా రిలీజ్ అవుతోంది. చాలా హ్యాపీగా ఉంది. ఐదేళ్ల కిందట తీసిన మా సినిమాకు, ఇప్పుడు థియేటర్లలో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలనే ఎక్సయిట్ మెంట్ ఉంది.”
“కృష్ణ అండ్ హీజ్ లీల” సినిమాను “ఇట్స్ కాంప్లికేటెడ్” పేరిట వాలంటైన్స్ డే కానుకగా 14న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. శ్రద్ధా శ్రీనాధ్, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రవికాంత్ దర్శకుడు. రానా నిర్మాత.