
‘పుష్ప-2’ ప్రమోషన్ నడుస్తున్న రోజులవి. రిలీజ్ డేట్ దగ్గరపడింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓవైపు దేవిశ్రీ ప్రసాద్ ఇతర వ్యవహారాలతో బిజీ. సరిగ్గా అప్పుడే ఊహించని నిర్ణయం తీసుకున్నారు మేకర్స్. ‘పుష్ప-2’ రీ-రికార్డింగ్ కోసం బయట నుంచి మ్యూజిక్ డైరక్టర్స్ ను తీసుకొచ్చారు.
‘పుష్ప-2’ రీ-రికార్డింగ్ లో తమన్, సామ్ సీఎస్, అజనీష్ లోక్ నాధ్ లాంటి కొందరు సంగీత దర్శకులు పాలుపంచుకున్నారు. వీళ్లలో సామ్ సీఎస్ వర్క్ యూనిట్ కు నచ్చింది. అతడి వర్క్ ను వాడుకోవడంతో పాటు టైటిల్ క్రెడిట్ కూడా ఇచ్చారు.
ఈ క్రమంలో సుకుమార్ కు, దేవిశ్రీ ప్రసాద్ కు చెడిందంటూ గాసిప్స్ మొదలయ్యాయి. వీళ్లిద్దరిది మామూలు బంధం కాదు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదంటే వీళ్లిద్దరూ ఎంత జాన్ జిగిరీ దోస్తులో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి దేవిశ్రీని పాక్షికంగా పక్కనపెట్టి, మరో మ్యూజిక్ డైరక్టర్ సుకుమార్ కోసం వచ్చాడనగానే అంతా అవాక్కయ్యారు. ఇద్దరికీ చెడిందనుకున్నారు. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సుక్కూ,
తాజాగా మరోసారి స్పందించాడు. భవిష్యత్తులో కూడా దేవిశ్రీ లేకుండా తను సినిమాలు చేయలేనన్నాడు. తన పేరును సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ గా మార్చేస్తే బెటరేమో అని అభిప్రాయపడ్డాడు.