
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. “డీజే టిల్లు”, “టిల్లు స్క్వేర్” సినిమాలతో హీరోగా తన మార్కెట్ ని భారీగా పెంచుకున్నాడు. ఐతే, “టిల్లు స్క్వేర్” విడుదలై ఏడాది కావొస్తోంది. ఈ గ్యాప్ లో మరో సినిమా విడుదల చెయ్యలేకపోయాడు. పెద్ద హీరోల తరహాలో ఏడాదికి ఒక్క సినిమా చేస్తున్నాడు.
ఐతే, ఇకపై అలా ఉండదు అని చెప్తున్నాడు. తాను స్లోగా సినిమాలు చేసి ఇక నష్టపోదల్చుకోలేదు అంటున్నాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేస్తే ఇప్పుడున్న మార్కెట్ రీత్యా బాగా సంపాదించుకోవచ్చు. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే చాలా ఆదాయం కోల్పోయినట్లే.
మిగతా హీరోల్లా సిద్ధూకి పెద్ద బ్రాండ్స్ లేవు. వాటివల్ల ఆదాయం రాదు. కేవలం సినిమాల పారితోషకం మీదే ఆధారపడాలి. అందుకే ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు.
వచ్చేనెల 10న “జాక్” అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో “తెలుసుకదా” అనే సినిమా రానుంది. ఈ రెండు విడుదల కాకముందే, “కోహినూర్” అనే మరో సినిమా మొదలుపెట్టాడు. దాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు స్పీడ్ పెంచాడు సిద్దూ జొన్నలగడ్డ.