
నాని హీరోగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్నాడు. యాక్షన్ సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో సాఫ్ట్ సినిమాలు కూడా చేస్తున్నాడు. హీరోగా తన కథ సెలెక్షన్ బాగున్నట్లే నిర్మాతగా కూడా మంచి కథలు ఎంచుకుంటున్నాడు.
నాని సమర్పించిన “కోర్టు” సినిమా ఈ రోజు విడుదలైంది. ప్రియదర్శి లాయర్ పాత్రలో, ఇద్దరు టీనేజర్ల ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. రెండు రోజుల ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఆ షోల నుంచే మంచి టాక్ మొదలైంది. ఈ సినిమా మీకు నచ్చుతుంది తప్పకుండా చూడండి అని నాని విడుదలకు ముందే చెప్పాడు. ఒకవేళ తన మాట అబద్దమైతే తాను నటిస్తున్న “హిట్ 3” (మే 1న విడుదల) సినిమాని చూడకండి అని మరీ చెప్పాడు నాని.
నాని జోస్యం, నాని నమ్మకం నిజం అయ్యాయి. మొదటి రోజు మంచి వసూళ్లు సాధిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు అమెరికాలోనూ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రాబట్టుకొంది.
హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన అంచనా చాలావరకు కరెక్ట్ అవుతుంది అని నాని ప్రూవ్ చేసుకున్నారు.