“కిల్” సినిమా రీమేక్ రైట్స్ ను నిర్మాత కోనేరు సత్యనారాయణ దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాను వరుణ్ తేజ్ తో నిర్మించబోతున్నాడంటూ కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడీ రీమేక్ అవసరమా అనే చర్చ మొదలైంది.
“కిల్” సినిమా ఓటీటీలో పెద్ద హిట్టయింది. కాబట్టి దీన్ని రీమేక్ చేయాలనుకోవడంలో తప్పు లేదు. అయితే ఇప్పుడీ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీలో పెట్టేశారు. ఇకపై ఓటీటీలో “కిల్” సినిమాను తెలుగులో కూడా చూడొచ్చన్నమాట. అలాంటప్పుడు రీమేక్ చేసి ఉపయోగం ఏంటి?
గతంలో “మానాడు” విషయంలో కూడా ఇదే జరిగింది. ఆ సినిమాను రానా రీమేక్ చేయాలనుకున్నాడు. అంతా ఓకే అయిపోయింది. కట్ చేస్తే, తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో ఆ రీమేక్ ను ఆపేశారు.
ఇప్పుడు “కిల్” రీమేక్ విషయంలో మేకర్స్ ఏం చేస్తారనేది చూడాలి. నిజానికి ఇలా ఓ రీమేక్ అనుకున్నప్పుడు, తెలుగు డబ్బింగ్ తో పాటు, తెలుగు థియేట్రికల్ రిలీజ్ ను ఆపేస్తారు. కానీ అప్పటికే స్ట్రీమింగ్ రైట్స్ కింద తెలుగు వెర్షన్ హక్కులు ఇచ్చేస్తే, ఇలాంటి సమస్యలే ఎదురౌతాయి.