
ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ ఈ రోజు ఉదయం ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరి వెంటనే డిశ్చార్జ్ అయ్యారు. నీరసం, డీహైడ్రేషన్ కారణంగా ఆయనకు చెమటలు పట్టడం, నొప్పి కలగడం జరిగింది అని వైద్యులు తేల్చారు. నాలుగు గంటల చికిత్స తర్వాత ఇంటికి పంపించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుంది అని రెహమాన్ కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఆసుపత్రి కూడా ఆరోగ్య బులెటిన్ విడుదల చేసింది. “ఈ రోజు ఉదయం రెహమాన్ డీహైడ్రేషన్ లక్షణాలతో మా ఆసుపత్రికి వచ్చారు. రెగ్యులర్ చెకప్ తర్వాత ఇంటికి పంపించాం” అని అపోలో ఆసుపత్రి తెలిపింది.
ఐతే, ఇటీవల తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన ఆయన భార్య సైరా భాను తనని రెహమాన్ మాజీ భార్యగా సంబోధించొద్దు అని మీడియాని కోరారు. తాను ఇప్పటికే ఆయన భార్యనే, మాజీని కాదు అంటున్నారు సైరా.
“ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఛాతీలో నొప్పి వచ్చి యాంజియోగ్రఫీ చేయించుకున్నాడని, అల్లా దయవల్ల ఇప్పుడు బాగానే ఉన్నాడని నాకు వార్త అందింది. మేము అధికారికంగా విడాకులు తీసుకోలేదని, మేము ఇంకా భార్యాభర్తలుగా ఉన్నామని నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, గత రెండేళ్లుగా నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మేం విడిగా ఉండాలనుకున్నాం. దయచేసి ‘మాజీ భార్య’ అని పిలవకండి,” అని ఆమె మీడియాకు విడుదల చేసిన ఆడియో నోట్ లో తెలిపారు.

ఐతే, ఆరోగ్యం బాలేకపోతే విడిగా ఉండడమేంటో? విడిపోతున్నట్లు ప్రకటించింది సైరా భానునే. ఇప్పుడు మళ్ళీ కలిసిపోయే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది.