ఏ హీరోనైనా జీవితంలో ఒక్కసారైనా మణిరత్నం దర్శకత్వంలో నటించాలని కోరుకుంటాడు. అదే విధంగా హీరోయిన్లు కూడా మణిరత్నం దర్శకత్వంలో నటించడాన్ని అదృష్టంగా, గౌరవంగా ఫీల్ అవుతారు. మరి మణిరత్నం మనసులో ఉన్న హీరోయిన్ ఎవరు?
తాజాగా ఈ విషయం బయటకొచ్చింది. హీరోయిన్ సాయిపల్లవితో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టాడు దిగ్గజ దర్శకుడు మణిరత్నం. నిజంగా ఓ హీరోయిన్ కు ఇంతకంటే గౌరవం, గొప్ప ఇంకేమైనా ఉంటుందా? ప్రస్తుతం ఇదే ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోంది సాయిపల్లవి.
శివ కార్తికేయన్ సరసన ‘అమరన్’ అనే సినిమా చేసింది సాయిపల్లవి. కమల్ హాసన్ నిర్మించిన ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి డైరక్ట్ చేశారు. దీపావళి కానుకగా ఈనెల 31న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు
ప్రస్తుతం కమల్ హాసన్ తో ‘థగ్ లైఫ్’ అనే సినిమా చేస్తున్న మణిరత్నం, కమల్ కోరిక మేరకు ‘అమరన్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. తను సాయిపల్లవి అభిమానినని, ఆమెతో సినిమా చేయాలని ఉందని, తప్పకుండా చేస్తానంటూ ఆయన ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకు కేవలం ఐశ్వర్యరాయ్ విషయంలో మణిరత్నం ఈ కామెంట్స్ చేశారు. మళ్లీ ఆ ఘనత సాయిపల్లవికే దక్కింది.