అనన్య నాగళ్ళ ఇప్పటికే ‘మల్లేశం’, ‘వకీల్ సాబ్’ చిత్రాలతో పేరు తెచ్చుకొంది. తెలంగాణకి చెందిన అనన్య అచ్చ తెలంగాణ యువతిగా నటించిన చిత్రం… ‘పొట్టేల్’. ఈ సినిమా గురించి అనన్య చెప్తున్న ముచ్చట్లు…
ఇందులో తల్లి పాత్ర అన్నపుడు ఎలా అనిపించింది?
‘పొట్టేల్’ కథ చెప్పినప్పుడు చిన్న పాపకి తల్లిగా నటించాలా వద్దా అన్న డైలమా వచ్చింది. ఎందుకంటే అంతకుముందే ఒక వెబ్ సిరిస్ చేశాను. మళ్ళీ మదర్ పాత్ర అంటే ఒకే తీరు అవుతుందేమో అనుకున్నాను. కానీ ‘పొట్టేల్’ కథలో చదువు అనే పాయింట్ చాలా నచ్చింది. అందుకే ఒప్పుకున్నాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు బుజ్జమ్మ. చాలా స్ట్రాంగ్ రోల్. ఇందులో పొట్టలో తన్నే సీన్ ఒకటి ఉంది. అది చేసేప్పుడు భయపడ్డాను. కానీ పాత్రకి తగ్గట్లు స్ట్రాంగ్ గా ఉండాలి అని చేశాను. తెలంగాణ కల్చర్ ని అద్భుతంగా బ్లెండ్ చేసిన సినిమా ఇది.
కథకి, టైటిల్ కి సంబంధం ఉందా?
పొట్టేల్ లేకపోతే ఈ కథ లేదు. పొట్టేల్ పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు కొండ అడ్డం వస్తే దాన్ని ఢీకొడుతుంది కానీ ఆగదు. అది పొట్టేల్ స్వభావం. ఈ కథలో హీరో క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా ముందుకు వెళ్లడమే కానీ వెనకడుగు వెయ్యడు. ఇక పొట్టేలుకి కూడా ఈ కథలో పాత్ర ఉంది. ఆ విధంగా అన్ని విధాలా ఈ టైటిల్ సరి అయినది.
వస్తోన్న పాత్రలు సంతృప్తి ఇస్తున్నాయా?
మొదట సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లవ్ స్టోరీస్, క్యూట్ క్యారెక్టర్స్ చేద్దామనుకున్నాను. అయితే అప్పుడు నాకు అంత అవగాహన లేదు. ‘మల్లేశం’ తర్వాత ప్రేక్షకులు నా నుంచి మెచ్యూర్ పాత్రలే కోరుకుంటున్నారు. దర్శక, నిర్మాతలు కూడా అవే ఆఫర్ చేస్తున్నారు. ఒక వర్గం ప్రేక్షకులకు చేరువ కాగలిగాను. ఇలాంటి పాత్రలు చెయ్యాలంటే తెలుగులో వినిపించే పేర్లలో నా పేరు కూడా వస్తోంది. అందుకే నేను హ్యాపీ. ‘పొట్టేల్’ లాంటి సినిమా చూసి మా అమ్మ కూడా గర్వంగా ఫీల్ అవుతుంది అనిపిస్తోంది.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
‘శ్రీకాకుళం షెర్లక్ హోమ్స్’ రిలీజ్ కి రెడీగా వుంది. సతీష్ వేగేశ్న గారి ‘కథకళి’ సినిమా జరుగుతోంది ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమా ఒప్పుకున్నాను.