
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు సినిమాలు తీయడం లేదు. కొందరు యువ దర్శకులకు తన ఐడియాలు చెప్పి సినిమాలు తీయిస్తున్నారు. అలా చేసిన కొత్త చిత్రం… ‘శారీ’ (Saaree).
ఇన్ స్టాగ్రామ్ లో తన శారీ ఫోటోషూట్ లతో మొదట గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి ఆరాధ్య దేవి అందానికి ఫిదా అయిన ఆర్జీవీ శారీ కథ అల్లేశారు. ఈ సినిమా ఈ నెల 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో విడుదల కానుంది. ఐతే, ఇది చీర కథ కాదు ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంది అని అంటున్నారు ఆర్జీవీ. సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు గిరి కృష్ణ కమల్ దీన్ని రూపొందించారు.
“సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయి అనే పాయింట్ మీద చేసిన చిత్రమే ‘శారీ’. ఈ సినిమాకు నేను మూల కథ అందించాను. నేను చేసిన స్క్రిప్ట్ కంటే చాలా గొప్పగా దర్శకుడు గిరికృష్ణ కమల్ మూవీని రూపొందించాడు,” అన్నారు ఆర్జీవీ
హీరోయిన్ ఆరాధ్య దేవి తనకు అవకాశం ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థ్యాంక్స్ చెప్పింది. :ఈ సినిమా నాకొక డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ పాత్రలో నటించేందుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు డైరెక్టర్ కృష్ణకమల్,” అని తెలిపింది ఆరాధ్య.