
“ఎల్ 2 ఎంపురాన్” (“L2 Empuraan”) సినిమా వివాదం ఇంకా రగులుతూనే ఉంది. బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తల ఆగ్రహంతో ఆ సినిమాలో 17 సీన్లు మార్చారు లేదా డైలాగులు వినిపించకుండా చేశారు. హీరో మోహన్ లాల్ ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఇక దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హిందూ వ్యతిరేకి అని, కమ్యూనిస్ట్ కామ్రేడ్ అని, ఆయన భార్య గతంలో బిబిసిలో పనిచేసింది కాబట్టి భార్యాభర్తలిద్దరూ బీజేపీ వ్యతిరేక వర్గంలో సభ్యులు అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి తాజాగా ఫేస్ బుక్ లో తన ఆవేదనని వెళ్లగక్కారు. 70 ఏళ్ల వయసులో తనని మనోవేదనకి గురిచేస్తున్నారు అని తన కొడుకుని కావాలని కొందరు బలిపశువుని చేస్తున్నారు అని ఆమె బాధపడుతూ లెటర్ పోస్ట్ చేశారు.
L2 Empuraan వివాదం దేనికి?
“ఎల్ 2 ఎంపురాన్” (“L2 Empuraan”)లో సినిమా ప్రారంభంలోనే 2002లో జరిగిన మత ఘర్షణలు చూపిస్తారు. ఆ గొడవల్లో బాబు భజరంగీ అనే హిందూ నాయకుడు ముస్లింలను శిక్షిస్తాడు. ఊచకోతలో పాల్గొంటాడు. ఏళ్ల తర్వాత అతను కేంద్రంలో కీలక శక్తి అవుతాడు. ప్రస్తుత కాలంలో బాబు భజరంగీ, అతని అనుచరుడు ఇతర రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తారు. అలా, కేరళ ముఖ్యమంత్రిని బెదరించి తమ పార్టీతో చేతులు కలపమని చెప్తారు. లేదంటే కేసులు పడుతాయని ఆ ముఖ్యమంత్రి భయపడి ఒప్పుకుంటాడు.
అలాగే, ముఖ్యమంత్రి సోదరి ప్రియ (మంజు వారియర్), హీరో స్టీఫెన్ నెడుంపల్లి (మోహన్ లాల్) భజరంగీ ఎత్తుగడలకు మరో ప్లాన్ వేస్తారు. ప్రియ రాజకీయ పార్టీ పగ్గాలు చేపట్టగానే కేంద్ర సంస్థ అయిన ఈడీ అధికారులు వచ్చి ఆమెని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తారు.
భజరంగీ అనే నేత పేరు పెట్టడం, హిందువులే 2002 మత ఘర్షణల్లో ఊచకోత చేసినట్లు చూపించడంలో ప్రధానంగా అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇది హిందువుల వ్యతిరేక చిత్రం అని, ఒక ప్రాపగాండా మూవీ పృథ్వీరాజ్ తీశాడు అని బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మోహన్ లాల్ క్షమాపణలు చెప్పారు. అలాగే భజరంగీ పేరు మార్చారు. అలాగే మాట ఘర్షణల సన్నివేశాలు తొలగించారు.
మల్లికా సుకుమారన్ ఏమంటున్నారు అంటే….
“ఎంపురాన్ సినిమా సన్నివేశాలను ఇలా ఉద్దేశపూర్వకంగా తీసి పృథ్వీరాజ్, సహా నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ మోహన్ లాన్ మోసం చేశారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. మోహన్ లాల్ కి తెలీకుండా తీశారని అంటున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నాయి. తెరవెనుక ఏమి జరిగిందో తెలుసుకున్ననేను…. పృథ్వీరాజ్ ను ఒంటరిని చేసే ప్రయత్నాలు చూసి చాలా బాధపడ్డాను. మావాడిని బలిపశువుని చేస్తున్నారు.
వాళ్ళందరూ కలిసి స్క్రిప్ట్ చదివారు. అందరూ తీసిన సన్నివేశాలను చూసి ఓకే అన్నారు. సినిమా విడుదలైన తర్వాత పృథ్వీరాజ్ ఒక్కడే దానికి ఎలా బాధ్యత వహిస్తాడు? వివాదాస్పద సన్నివేశాలు అన్నింటికీ అందరిదీ బాధ్యతే. మా వాడు ఒక్కడే ఎలా బాధ్యత వహిస్తాడు?”