
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన “ఆదిత్య 369” ఏప్రిల్ 4న మరోసారి విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సింగీతం ముచ్చట్లు..
సైన్స్ ఫిక్షన్ ఆలోచన ఎలా వచ్చింది?
నేను ఈ సినిమాని “బ్యాక్ టు ద ఫ్యూచర్” అనే హాలీవుడ్ మూవీ స్పూర్తితో తీశానని చాలామంది అనుకుంటారు. కానీ . నేను కాలేజీ రోజుల్లోనే హెచ్. జి. వెల్స్ రచించిన నవల “ది టైం మిషన్ ” చదివాను. టైం ట్రావెల్ కాన్సెప్ట్ అందులోనిదే. బ్లాక్ అండ్ వైట్ లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో టైం మెషిన్ సినిమాలు హాలీవుడ్ లో చాలా వచ్చాయి. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఇది ఒక సబ్జెక్టుగా తీస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో దానికి సంబంధించిన లైన్ ఆర్డర్ మొత్తం రఫ్ గా పెట్టుకున్నాను.
ఒకసారి ఫ్లయిట్ లో ఎస్పీ బాలసుబ్రమణ్యంతో నేను ట్రావెల్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఇద్దరం అదీ ఇదీ మాట్లాడుకుంటుండగా.. నా దగ్గర ఒక సబ్జెక్టు ఉందని నేను చెప్పడం మొదలుపెట్టాను. ఆయన ఫుల్ ఎక్సైట్ అయ్యారు. ‘కాన్సెప్ట్ చాలా బాగుంది.. మనం ఇది తప్పకుండా చేయాలి‘ అని అన్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకు స్టోరీ గురించి చెప్పారు. కానీ వారికి సైన్స్ ఫిక్షన్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇదేదో ఒక ఫాంటసీ సినిమా అనుకున్నారు. కానీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మాత్రం కథను బాగా నమ్మారు. కృష్ణ ప్రసాద్ గారికి చెప్పారు. ఆయనకు కూడా సైన్స్ ఫిక్షన్ అనేటువంటి జోనర్ గురించి తెలియదు.
ఆయన గొప్పతనం ఏంటంటే.. పెద్ద పెద్ద నిర్మాతలే ఇదేమిటని సందేహిస్తున్న సమయంలో ఇందులో ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ ఆయనకు వచ్చింది. ఇది మామూలు ఫాంటసీ కాదు… మామూలు చరిత్ర కాదు.. ఇది ఇంకేదో ఉంది.. అని చెప్పి ఒక గుడ్డి నమ్మకంతో కృష్ణప్రసాద్ గారు దూకేశారు. అంటే ముందు వెనుక చూసుకోలేదు. ఎలా చేస్తామో తెలియదు. స్విమ్మింగ్ గురించి తెలుసుకుని నీళ్లలోకి దూకడం కాదు.. ముందు నీళ్లల్లోకి దూకి స్విమ్మింగ్ నేర్చుకోవడం అన్న చందంగా చేశారు. ఆ క్రెడిట్ మొత్తం కృష్ణ ప్రసాద్ గారిదే. చాలా గట్ ఫీలింగ్‌తో ముందుకు వచ్చారు.
బాలకృష్ణనే ఎందుకు అనుకున్నారు?
స్క్రిప్ట్ లోనే ఒక సైంటిస్ట్ టైం ట్రావెల్ మెషిన్ కనిపెడతాడు, దాంతో పాత కాలంలోకి వెళ్తాడు హీరో అని ఉంది. గతానికి వెళ్ళినప్పుడు చరిత్రకు సంబంధించి మనకు తెలిసిందిగా ఉండాలి. మొట్టమొదటిగా నేను అనుకున్నది ఏమిటంటే.. ఇండియన్ ఇండిపెండెన్స్ డే రోజుకు వెళ్లాలని. కానీ అక్కడి కథలో హీరో ఇన్వాల్వ్ అవ్వడానికి స్కోప్ లేదు. ఎక్కడికి వెళ్ళినా హీరో కథలో ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పుడు చూస్తే.. రెండే రెండు చరిత్రకు సంబంధించిన ఘట్టాలు దొరికాయి. ఒకటి రాయలవారు భువన విజయం.. మరొకటి అక్బర్. అక్బర్ కాలంలో బీర్బల్, అనార్కలి, సలీం వీళ్ళందరూ ఉన్నారు. అక్బర్ – బీర్బల్ కు సంబంధించి ఆల్రెడీ తీశారు.. నాకంత నచ్చలేదు. అందుకే కృష్ణదేవరాయల కాలాన్ని ఎంచుకున్నాను పైగా అప్పటికే ఎన్టీ రామారావుగారు శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేశారు. అలాగే ‘మహామంత్రి తిమ్మరుసు‘ కు నేను పని చేశాను. స్క్రిప్ట్ కూడా ఒక వెర్షెన్ రాశాను పింగళి నాగేంద్రరావు గారికి.
ఆ రోజుల్లో నాచేత ఒకొక స్క్రిప్ట్ ఫస్ట్ వెర్షెన్ రాయించేవారు. ఆ విధంగా తిమ్మరుసు స్క్రిప్ట్ లో నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. శ్రీకృష్ణదేవరాయల పాత్ర నాకు చాలా ఇష్టం. ఇక ఆ పాత్ర ఎవరు వేయాలని ఆలోచిస్తున్నప్పుడు.. ఒకే ఒక వ్యక్తి మదిలో వచ్చారు. నాడు రామారావుగారు వేసిన శ్రీకృష్ణదేవరాయల పాత్రలో నేడు అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమవుతుందని మేము నిర్ణయించుకున్నాము. ఆ తర్వాత ఆయన్ను సంప్రదించడం, కథ చెప్పడం.. బాలకృష్ణ గారికి స్టోరీ బాగా నచ్చి సినిమా చేద్దామని వెంటనే ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి.

శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు ఫస్ట్ ఛాయిస్ బాలకృష్ణ గారే. ఇప్పటికీ ఆ పాత్రలో బాలకృష్ణ గారిని తప్ప మరొకరిని ఊహించలేను.
ఈ సినిమాకి ముగ్గురు కెమెరామెన్లు ఎందుకు పనిచేశారు?
మ్యూజిక్ డైరెక్టర్ గా ముందు నుంచి ఇళయరాజా గారినే అనుకున్నాము. ఆయన వద్దకు వెళ్లడం, చెప్పడం.. ఇళయరాజా గారు కూడా సంతోషంగా ఒప్పుకోవడం, కథలో ఇన్వాల్వ్ కావడం జరిగింది.
కెమెరామెన్ విషయంలో మాత్రం దైవ నిర్ణయం. ఎందుకంటే మొట్టమొదట పి.సి.శ్రీరామ్ గారిని అనుకున్నాము. ఫస్ట్ షెడ్యూల్ కు ఆయనే పని చేశారు. అయితే సడన్ గా ఆయన జబ్బు పడ్డారు. దాంతో సినిమాకు వర్క్ కంటిన్యూ చేయలేకపోయారు. మళ్లీ షూటింగ్ కు పిలుస్తామేమో అన్న భయంతో ఆయన్ను చూసేందుకు కూడా మమ్మల్ని శ్రీరామ్ గారి మదర్ అనుమతించలేదు. శ్రీరామ్ గారు చెప్పేశారు నేను చేయలేను.. వేరేవాళ్లను చూసుకోమని. అక్కడ నుంచి రెండు మాసాల పాటు రాయలవారి ఎపిసోడ్ చేయాలని ప్లాన్ చేశాము. సరిగ్గా అదే సమయంలో వి.ఎస్.ఆర్. స్వామి గారు ఆ డేట్స్ లో ఖాళీ అయ్యారు. ఆయన వద్దకు వెళ్లగా.. వెంటనే ఒప్పుకున్నారు. వి.ఎస్.ఆర్. స్వామి కాల్షీట్స్ అయిపోగానే.. భవిషత్తు ఎపిసోడ్ మొత్తాన్ని కబీర్ లాల్ ఛాయాగ్రహణం చేశారు. నిజంగా ముగ్గురు కెమెరామెన్లు పని చేయడం దైవ నిర్ణయం.
రాయులవారి సెట్ మొత్తాన్ని పేకేటి రంగాగారే డిజైన్ చేశారు. టైం మెషిన్ డిజైన్ చేయడానికి మొదట మేము స్కెచెస్ వేసుకున్నాము. టైం మెషిన్ రియల్‌గా ఉండాలని నేను అనుకున్నాను. స్కెచెస్ మీద డిస్కషన్స్ అనంతరం పేకేటి రంగా చిన్న సైజులో టైం మెషిన్ మోడల్ చేశాడు. అది ఓకే అనుకున్నాక.. సెట్‌లో పెద్దగా టైం మెషిన్‌ను తయారు చేశాడు. లోపలికి వెళ్ళేటట్టుగా స్టెప్స్, ఛైర్స్, గ్లాస్ ఇవన్నీ పెట్టాడు. మెషిన్ తిరగడానికి మోటర్, స్మోక్ రావడానికి గ్యాస్ వంటివి ఏర్పాటు చేశాడు. అందుకే అది స్క్రీన్ పై చాలా రియల్ గా ఉంటుంది.
‘కాలయంత్రం‘, ‘యుగపురుషుడు‘ వంటి టైటిల్స్ అనుకున్నారా?
లేదు.. లేదు.. నేను ముందు నుంచి ‘ఆదిత్య‘ అని అనుకున్నాను. కాంతి ఒక సెకండ్‌కు 186 వేల మైళ్లు ట్రావెల్ చేస్తుంది. లైట్ ట్రావెల్‌కు, టైం ట్రావెల్‌కు సంబంధం ఉంది. లైట్ అనగానే సూర్యుడు.. అందుకని ఆదిత్య. ఇక 369 అనేటువంటిది తర్వాత యాడ్ చేసింది. ఒక టైమ్ మెషిన్‌కు పేరు పెట్టాలి. అప్పుడు నాకు బోయింగ్ జ్ఞాపకం వచ్చింది. బోయింగ్ 737 అని పెడతారు.. అప్పుడే అది ఒక ఎయిర్ క్రాఫ్ట్ అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. అందుకే బాగా ఆలోచించి ఆదిత్య 369 అని పెట్టాము.
‘ఆదిత్య 369‘ సినిమాకు సీక్వెల్?
‘ఆదిత్య 369‘ సినిమాకు సీక్వెల్ స్టోరీ బాలకృష్ణ గారికి చెప్పాను. స్క్రిప్ట్ ను సైతం రెడీ చేశాము. మొట్టమొదట ‘ఆదిత్య 369‘ సీక్వెల్ తో బాలకృష్ణ గారు వాళ్ల అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారు. అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అయితే కుదరల్లేదు. కానీ బాలకృష్ణ గారు మాత్రం ఎప్పటికైనా సీక్వెల్ చేయాలని అంటుంటారు. అది ఎప్పుడు అవుతుందన్నది దైవ నిర్ణయం.
ఇప్పుడు మీరు టైమ్ మెషిన్ ఎక్కితే ఏ కాలానికి వెళ్లాలనుకుంటారు?
ఇప్పుడు నాకు 93 ఏళ్లు. నేను జీవితంలో నేర్చుకుంది ఏంటంటే.. మొన్నటికన్నా నిన్న గొప్పది. నిన్నటి కన్నా ఇవాళ గొప్పది. పాత కాలం ఎంత బాగుండేదో అని అందరూ అంటుంటారు. కానీ నాటి మ్యూజిక్‌ను ఇప్పుడు వినమంటే వినరు. అది బాగా లేదనే కదా అందరం ముందుకు వెళ్తున్నాం. నాకేంటంటే.. నిన్న, మొన్న కన్నా ఇవాళ ఇప్పుడు మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. సో.. బ్యాక్‌కు వెళ్లడమనేది నాకు ఇష్టం లేదు. ఒక్క సెకండ్ కూడా వెనక్కి వెళ్లలేను. ఎందుకంటే అదంతా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాం? అన్నది చాలా ముఖ్యం. ఇక ఫ్యూచర్‌కు వెళ్లామంటే.. అది తిరిగి మన లైఫ్‌లోకి వచ్చినప్పుడు థ్రిల్ పోతుంది. కాబట్టి, పాస్ట్ మరియు ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించాలి. 93 సంవత్సరాల వయసులో ఇదే నా ఫిలాసఫీ.