
మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘గేమ్ ఛేంజర్’ కథనాలే. ఆ సినిమా ఫ్లాప్ అయిందని, భారీగా నష్టాలు తెచ్చిపెట్టిందంటూ దిల్ రాజు చెప్పినట్టు వరుసగా వార్తలు చూస్తున్నాం. వీటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లాడు దిల్ రాజు సోదరుడు శిరీష్.
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడు కానీ, హీరో కానీ కనీసం కాల్ చేయలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు, ‘గేమ్ ఛేంజర్’ దెబ్బతో ఆల్ మోస్ట్ ఇంటికెళ్లిపోయే స్థితికి చేరిపోయామని, ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో తేరుకున్నామని అన్నాడు. ‘గేమ్ ఛేంజర్’ నష్టాల్ని ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా దాదాపు 60 శాతం భర్తీ చేసిందని అన్నాడు.
ఇలా ‘గేమ్ ఛేంజర్’ పై వరుసగా వస్తున్న నెగెటివ్ వార్తలతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇబ్బంది పడ్డారు. దిల్ రాజు, శిరీష్ పేర్లు ప్రస్తావించకుండా ఓపెన్ లెటర్ విడుదల చేశారు. సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఏ నిర్మాత హీరోను బ్లేమ్ చేయలేదని, ఒక్క దిల్ రాజు మాత్రమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
సినిమా హిట్టయితే తమ గొప్పదనమని, ఫ్లాప్ అయితే హీరోదే తప్పు అన్నట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మెగా ఫ్యాన్స్. ఇంకోసారి ‘గేమ్ ఛేంజర్’ గురించి కానీ, రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలుంటాయని, ఇదే చివరి హెచ్చరిక అంటూ లెటర్ విడుదల చేశారు.
ఈ లెటర్ శిరీష్ వరకు వెళ్లినట్టుంది. వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యాడు. తను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు, సోషల్ మీడియా ద్వారా అపార్థాలకు దారితీసిందని, మెగాభిమానులు బాధపడినట్టు తనకు తెలిసిందని, ఒకవేళ తన మాటలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే క్షమించమంటూ లేఖ విడుదల చేశారు.