రాజకీయాల్లో ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదు, పరిస్థితులు తలకిందులైతే మొహం దాచుకోవడానికి కూడా చోటుండదు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీపై ఓ రేంజ్ లో సెటైర్లు వేశాడు వర్మ.
మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేష్ పై వర్మ వేసిన ట్వీట్స్ అన్నీ ఇన్నీ కావు. పవన్ కల్యాణ్ ను నిలకడ లేని వ్యక్తిగా, లోకేష్ ను బఫూన్ గా, చంద్రబాబును వెన్నుపోటుదారుడిగా అభివర్ణిస్తూ.. ఆర్జీవీ చేసిన హంగామా అందరికీ గుర్తే. అంతేకాదు, ఈ ముగ్గుర్ని ప్రధానంగా విమర్శిస్తూ, ఆయన సినిమాలు కూడా తీశాడు.
కట్ చేస్తే, ఇప్పుడు వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ-జనసేన గెలిచింది. ఇప్పుడు ఆర్జీవీ ఏం చేస్తాడు? నెటిజన్లు ఊరుకోరు కదా, మరీ ముఖ్యంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు అస్సలు తగ్గరు కదా? ఆ సెగనే ఫేస్ చేస్తున్నాడు వర్మ.
గతంలో వర్మ చేసిన కామెంట్స్ ను ఎత్తిచూపుతూ, అతడిపై భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తోంది ఓ సెక్షన్. ఇలాంటి ట్రోల్స్ వర్మకు కొత్త కాదు. కాకపోతే ఈసారి దారుణంగా ఉంది పరిస్థితి. వీటిని అతడు ఎలా ఫేస్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.