తన కెరీర్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది రెజీనా. తెలుగులో అడుగుపెట్టిన సమయంలో ఆమెకు ఒకేసారి 2 ఆఫర్లు వచ్చాయంట. వాటిలో శేఖర్ కమ్ముల సినిమా ఆఫర్ ను మిస్ చేసుకున్నట్టు వెల్లడించింది రెజీనా.
అప్పటికే కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన రెజీనా.. తెలుగులో కూడా ప్రయత్నించాలనుకుంది. అనుకున్నదే తడవుగా 2 సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది. సుధీర్ బాబు నటించిన ‘ఎస్సెమ్మెస్’, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలకు ఆమె ఒకేసారి ఎంపికైంది.
అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి మొదలయ్యాయంట. వీటిలో ఏదో ఒకటి మాత్రమే సెలక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో శేఖర్ కమ్ముల సినిమాను వదిలేసి, సుధీర్ బాబు సినిమాను ఎంచుకుందంట రెజీనా. కమ్ముల సినిమాలో ఒకరు కంటే ఎక్కువమంది అమ్మాయిలున్నారని, తనకు పేరు రాదేమో అనే ఆలోచనతో “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” మూవీని వదిలేసినట్టు వెల్లడించింది రెజీనా.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువగా సినిమాలు చేస్తోంది. దీనికి కారణం ఆమెకు టాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడమే. ఆమె నటించిన ‘ఉత్సవం’ సినిమా విడుదలకు సిద్ధమైంది.