బాలీవుడ్ లో తిరుగులేని రికార్డ్ సృష్టించాడు అల్లు అర్జున్. అతడు నటించిన ‘పుష్ప-2’ హిందీ వెర్షన్ 700 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. బాలీవుడ్ లో ఈ ఘనత సాధించిన తొలి హీరోగా రికార్డ్ సృష్టించాడు బన్నీ. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇప్పటివరకు ఏ హిందీ సినిమా 700 కోట్ల వసూళ్లు సాధించలేదు.
విడుదలకు ముందు ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనే అంచనాలుండేవి. ‘బాహుబలి-2’ను ఇది క్రాస్ చేస్తుందా లేదా అనే కథనాలు కనిపించాయి. కానీ ఆ సినిమాను దాటి ఎంతో ఎత్తుకు వెళ్లిపోయింది ‘పుష్ప-2’. ఇప్పట్లో 700 కోట్ల క్లబ్ లోకి మరో సినిమా చేరే అవకాశం లేదనేది బాలీవుడ్ ట్రేడ్ మాట.
రిలీజై ఇన్ని రోజులైనా ఉత్తరాదిన ఇంకా పుష్పరాజ్ ఫీవర్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. ఇలానే కొనసాగితే, ఈ వీకెండ్ నాటికి ఈ సినిమా మరో 70 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్ల నుంచి ఇప్పుడు తొలగించలేమని పలువురు థియేటర్ల ఓనర్లు చెప్తున్నారు. క్రిస్మస్ కానుకగా విడుదల అవుతోన్న “బేబీ జాన్” హిందీ సినిమాకు ఎక్కువ స్క్రీన్ లు ఇచ్చి బాగా ఆడుతున్న “పుష్ప 2″ని థియేటర్ల నుంచి తొలగించలేమని థియేటర్ల ఓనర్లు తెగేసి చెప్తున్నారు. హిందీలో ఈ సినిమాకి ఇంకా అంత క్రేజ్ ఉంది మరి.