‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం అమెరికా వెళ్లిన దిల్ రాజు హైదరాబాద్ వచ్చేశారు. వచ్చిన వెంటనే అల్లు అర్జున్ ఇష్యూలోకి ఎంటరయ్యారు. నేరుగా వెళ్లి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ వెంటనే మీడియా ముందుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య గ్యాప్ వచ్చేసిందనే పుకార్లను దిల్ రాజు కొట్టి పారేశారు. ఎప్పట్లానే పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలు, అనుమతులన్నీ అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. అంతేకాదు, రేపోమాపో ఇండస్ట్రీ పెద్దలతో సమావేశమవ్వడానికి కూడా సీఎం అంగీకరించినట్టు వెల్లడించారు.
ఇక అల్లు అర్జున్ కేసుపై స్పందిస్తూ.. దీనిపై కూడా ముఖ్యమంత్రితో చర్చించానని, అల్లు అర్జున్ తో కూడా చర్చలు జరుపుతానని.. ఇద్దరి మధ్య వారధిగా ఉంటానని దిల్ రాజు ప్రకటించారు. దిల్ రాజు ఎంటర్ అవ్వడంతో, ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా, తెలంగాణ ప్రభుత్వంలో ఓ భాగంగా కొనసాగుతున్నారు దిల్ రాజు. అదే హోదాలో అటు ప్రభుత్వానికి, ఇటు ఇండస్ట్రీకి మధ్య వారధిగా పనిచేస్తానని, అన్ని సమస్యల్ని త్వరలోనే పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని అన్నారు.