
ప్రియాంక చోప్రా ఇప్పుడు అమెరికాలో స్థిరపడింది. అమెరికన్ సింగర్, నటుడు నిక్ జోనాస్ ని పెళ్ళాడి, ఓ కూతురిని కన్నది. తాజాగా ప్రియాంక చోప్రా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెడుతోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తీస్తున్న భారీ చిత్రంలో ప్రియాంక చోప్రా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోనే ఉంటోంది.
మరోవైపు, ప్రియాంక చోప్రా పెళ్లికి ముందు పలువురితో డేటింగ్ చేసింది. కొందరు హీరోలతో సీరియస్ ప్రేమాయణం నడిపింది. ఆమె తల్లి ఆ విషయాలను ఇప్పుడు బయట పెట్టింది. తాజాగా ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. తన కూతురు డేటింగ్ విషయంలోనే కాదు మాజీ ప్రియులతో స్నేహం మైంటైన్ చెయ్యడంలో చాలా పద్దతిగా ఉంటుంది అని మురిసిపోతూ చెప్పారు మధు.
“ప్రియాంక తన మాజీ బాయ్ ఫ్రెండ్ లందరితోనూ మంచి సంబంధాలు కొనసాగిస్తోంది, ఒకరితో తప్ప. ఆమె ఎవరినైనా ఇష్టపడకపోతే, ఆమె వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటుంది. అది ఒక్కసారే జరిగింది. ఎందుకంటే ఆ సంబంధం తిరిగి పొందలేనిది,” అని ఆమె వెల్లడించింది.
ప్రియాంక గతంలో డేటింగ్ చేసిన కొంతమంది పురుషులను తాను అంగీకరించలేదని కూడా ఆమె తెలిపింది. ఏ మాజీ ప్రియుడితో ప్రియాంక స్నేహం కొనసాగించడం లేదు అన్న విషయంలో ఊహాగానాలు మొదలయ్యాయి.