![Priya Bhavani Shankar](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/08/priyabhavanishankar-marriage.jpg)
మొన్నటికిమొన్న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తాజాగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గడిచిన రెండేళ్లుగా హీరోయిన్లు వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో భామ చేరింది. ఆమె పేరు ప్రియా భవానీ శంకర్.
తమిళ, తెలుగు చిత్రాలతో పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. పరిశ్రమకు రాకముందు నుంచే రాజ్ వేల్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. దాదాపు పదేళ్లుగా వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అతడితో ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధపడింది ప్రియా భవానీ శంకర్. వచ్చే ఏడాది తామిద్దరం పెళ్లి చేసుకుంటామని ప్రకటించింది.
న్యూస్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది ప్రియా భవానీ శంకర్. గతేడాది రిలీజైన “కల్యాణం కమనీయం” అనే సినిమాతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇయర్ “భీమా” సినిమాలో నటించింది. ఇక తాజాగా “భారతీయుడు-2″లో కూడా ఓ కీలక పాత్ర పోషించింది.
ప్రస్తుతం ఆమె తెలుగులో సత్యదేవ్ హీరోగా “జీబ్రా” అనే సినిమాలో నటిస్తోంది. అటు “ఇండియన్-3” కోసం కూడా రెడీ అవుతోంది. నాగచైతన్య నటించిన “ధూత” వెబ్ సిరీస్ లో అతడికి భార్యగా కూడా నటించింది.