
బిత్తిరి సత్తికి వివాదాలు కొత్త కాదు. గతంలో కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నాడు. తాజాగా మరో కొత్త వివాదం అతడి మెడకు చుట్టుకుంది. తాజాగా బిల్లుగీత అనే షార్ట్ వీడియో చేశాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.
ఇందులో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో కామెడీ చేశాడు. ఇది కొంతమందికి ఆగ్రహం తెప్పించింది. హిందువుల పవిత్ర గ్రంధమైన భగవద్గీతను బిత్తిరి సత్తి అపహాస్యం చేశాడంటూ కొందరు అతడిపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. రాష్ట్రీయ వానర సేన సంఘం అనే ఆర్గనైజేషన్ ఏకంగా బిత్తిరి సత్తిపై పోలీసు కేసు నమోదు చేసింది.
ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిత్తిరి సత్తి తక్షణం ఆ వీడియోని తొలిగించి, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని అందులో డిమాండ్ చేశారు. తన చుట్టూ వివాదం రాజుకుందని గ్రహించిన వెంటనే బిత్తిరి సత్తి ఆ వీడియోల్ని డిలీట్ చేశాడు.
అయితే అక్కడక్కడ కొన్నిచోట్ల అవి కనిపిస్తూనే ఉన్నాయి. క్షమాపణలు చెప్పడానికి కూడా అతడు సిద్ధంగా ఉన్నాడు.