‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..‘‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు,’’ అని చెప్పారు.
దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే. ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి’’ అని అన్నారు.
ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా’’ అని చెప్పారు.