సమంత టాప్ హీరోయిన్ అన్న మాట నిజమే కానీ ఆమె నటించిన సినిమా థియేటర్లో విడుదలై చాలా కాలమే అవుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఆమె తెలుగులో సినిమా చెయ్యడం లేదు. తెలుగులోనే కాదు ఏ భాషలో కూడా నటించలేదు. కేవలం “సిటాడెల్” అనే వెబ్ సిరీస్ మాత్రమే పూర్తి చేసింది.
తాజాగా ఆమె కొత్త సినిమా ఒకటి ఒప్పుకొంది. అలాగే మరో వెబ్ సిరీస్ (“రక్త బ్రహ్మాండ”) సైన్ చేసింది. కానీ ఆమెకి ఓటిటి మార్కెట్ లో, సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే, ఆమె సినిమాల్లో నటించి చాలా కాలమే అయినా, ఆమె సినిమా పారితోషికానికి దాదాపు డబుల్ మొత్తంలో డబ్బులు ఇచ్చిందట అమెజాన్ ప్రైమ్.
“సిటాడెల్: హానీ బన్నీ” అనే వెబ్ సిరీస్ లో ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించింది. ఈ సిరీస్ లో నటించినందుకు ఆమెకి అక్షరాలా 10 కోట్ల రూపాయలు చెల్లించారట. ఈ వెబ్ సిరీస్ ని తీసిన రాజ్ అండ్ డీకే ఆమెకి క్లోజ్ ఫ్రెండ్స్. వారు ఆమెకి ఇలా భారీ మొత్తం దక్కేలా చూసుకున్నట్లు ఉన్నారు.
సమంత గతేడాది “ఖుషి” సినిమాలో నటించింది. ఆ సినిమాకి ఆమె 4 కోట్ల రూపాయలు తీసుకొంది. అంటే వెబ్ సిరీస్ లో నటించినందుకు అమ్మయికి ఏకంగా డబుల్ కన్నా ఎక్కువే పారితోషికం దక్కింది.
మొత్తంగా సమంత సినిమాల్లో నటించకపోయినా సంపాదన పరంగా బాగానే ఆర్జిస్తోంది.
ఇక తెలుగులో ఆమె నటించే తదుపరి చిత్రం.. “మా ఇంటి బంగారం”. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆమె.