పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఓ సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. జపాన్ లో త్వరలోనే రిలీజ్ కాబోతున్న ‘కల్కి’ ప్రచారానికి తను హాజరవ్వలేనని తెలిపాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కాలికి గాయమైంది.
అతడి చీలమండ బెణికినట్టు తెలుస్తోంది. దీంతో అతడి టోక్యో పర్యటన రద్దయింది. మరో 2 రోజుల్లో దర్శకుడు నాగ్ అశ్విన్, టోక్యో వెళ్లబోతున్నాడు. ప్రభాస్ కు జపాన్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమా నుంచి అతడికి అక్కడ ఆదరణ పెరిగింది.
బాహుబలి-2 రిలీజ్ తర్వాత, ప్రభాస్ ను చూసేందుకు చాలామంది జపనీయులు హైదరాబాద్ రావడం మొదలైంది. ఇప్పుడు కల్కి సినిమాతో తన ఫ్యాన్ బేస్ ను ప్రభాస్ మరింత పెంచుకుంటాడని అంతా భావిస్తున్నారు.
ఇక గాయం విషయానికొస్తే, అదేమంత పెద్ద గాయం కాదంటోంది ప్రభాస్ టీమ్. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకొని త్వరలోనే అతడు సెట్స్ పైకి వస్తాడని చెబుతోంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా స్టార్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు. జనవరి నుంచి ‘స్పిరిట్’ మొదలవుతుంది.