పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆయన అభిమానుల కోరిక. ఆయన ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ కి వచ్చినా వాళ్ళు “సీఎం సీఎం” అంటూ అరిచి గోల చేసేవారు. వారి కల నెరవేరడానికి ఇంకా టైం పడుతుంది.
కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే సగం గోల్ పూర్తి అయింది. “ఇప్పుడు డిప్యూటీ.. ఫ్యూచర్లో సీఎం”, అని అభిమానులు ఆనందంగా సంబరాలు మొదలు పెట్టారు.
ఈ రోజు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర మంత్రివర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ కార్యక్రమం జరిగిన గంట తర్వాత కేంద్ర హోం మంత్రి తన ట్వీట్ లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను అభినందిస్తూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ ని డిప్యూటీ సీఎం అని సంబోధించారు. దాంతో, అది అధికారిక ప్రకటన అయింది.
ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. ఇప్పడు 100 శాతం విజయం సాధించి పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో తన పేరు మార్మోగేలా చేసుకున్నారు. ప్రధాని మోదీకి చాలా దగ్గరివాడిగా మారారు.