ఉన్నట్టుండి సడెన్ గా వెలగపూడిలో ప్రత్యక్షమయ్యాడు సాయిదుర్గతేజ్. సెక్రటేరియట్ లోని తన ఆఫీస్ కు సాయిదుర్గతేజ్ ను ప్రత్యేకంగా పిలిపించాడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీనికి ఓ కారణం ఉంది.
సాయిదుర్గతేజ్ ఇండస్ట్రీకొచ్చి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. అందుకే తన మేనల్లుడ్ని ప్రత్యేకంగా ఆఫీస్ కు పిలిపించుకొని అతడికి శుభాకాంక్షలు చెప్పి, ప్రత్యేకంగా సన్మానించారు పవన్ కల్యాణ్. తన ఛాంబర్ లోనే ఏర్పాటుచేసిన కొండపల్లి బొమ్మల స్టోర్ నుంచి కొన్నింటిని బహుమతుల రూపంలో సాయిదుర్గతేజ్ కు అందించారు.
పవన్ నుంచి సన్మానం అందుకున్న సాయిదుర్గతేజ్ చలించిపోయాడు. ముసిముసిగా నవ్వుతూనే, మామపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎంతో భక్తితో కాళ్లకు నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఈ ప్రత్యేక సందర్భం కలకాలం తన మనసులో నిలిచిపోతుందని ప్రకటించిన సాయిదుర్గతేజ్.. పవన్ ను తన గురువుగా చెప్పుకొచ్చాడు. పవన్, సాయిదుర్గతేజ్ మధ్య ఉన్న ఆఫ్ స్క్రీన్ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ కలిసి ‘బ్రో’ అనే సినిమా కూడా చేశారు.