రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, అలియా భట్ హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియ లాంటి చాలామంది కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఉన్నాడా? అన్నీ అనుకున్నట్టు జరిగితే సత్యదేవ్ ఉండేవాడు. కానీ ఈ పాన్ ఇండియా సినిమా నుంచి అతడి పాత్రను తొలిగించారు. ఈ విషయాన్ని ఆ హీరో స్వయంగా బయటపెట్టాడు.
“రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేశాను. 10 రోజులు వర్క్ చేశాను. కానీ నా క్యారెక్టర్ ఫిట్ అవ్వలేదని తర్వాత తీసేశారు. ఆ తర్వాత దాని గురించి నేను ఎక్కడా ప్రస్తావించలేదు. రాజమౌళిని కూడా అడగలేదు. వాళ్లంటే నాకు అంత గౌరవం.”
10 రోజులు రాజమౌళితో వర్క్ చేసిన అనుభవం తనకు జీవితాంతం గుర్తుంటుందని అంటున్నాడు సత్యదేవ్.
రాజమౌళితో వర్క్ చేసిన ఆ రోజుల్ని తన కెరీర్ కు మాస్టర్ క్లాస్ గా భావిస్తానని తెలిపాడు. ఈ హీరో నటించిన ‘జీబ్రా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా ఇది.