ప్రముఖ మలయాళ హీరో మోహన్ లాల్ భయపడి పారిపోయారు అని నటి పార్వతి తీవ్రంగా కామెంట్ చేశారు. బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు మోహన్ లాల్ తన పదవిని వదులుకున్నారు అని ఆమె అన్నారు.
మలయాళ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల అంశం దుమారం రేపుతోంది. జయసూర్య, ముఖేష్ వంటి ప్రముఖ నటులపై కూడా కేరళ ప్రభుత్వం తాజాగా కేసులు పెట్టింది. పలువురు నటీమణులు తమను వేధించిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హాస్యనటుల పేర్లను బయటపెట్టారు.
మొత్తంగా మలయాళ చిత్రసీమని హేమ కమిటీ రిపోర్ట్ (లైంగిక వేధింపుల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీని కేరళ ప్రభుత్వం నియమించింది) కుదిపిసేంది. పెద్ద పెద్ద నటుల పేర్లు బయటికి రావడంతో అమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్) ఇరుకున పడింది. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ మొత్తం కార్యవర్గాన్ని రద్దు చేశారు. ఆయనతో సహా అందరి చేత రాజీనామా చేయించారు.
మోహన్ లాల్ ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఇప్పటికే విమర్శలు వచ్చాయి. ఐతే, నటి పార్వతి మాత్రం ఘాటు అయిన కామెంట్స్ చేసింది. మోహన్ లాల్, ఇతర అమ్మ కార్యవర్గ సభ్యులు పిరికి వాళ్ళు అని ఆమె పేర్కొంది.
అమ్మ అధ్యక్షుడిగానే కాదు మలయాళ చిత్రసీమలో టాప్ హీరోగా ఆయన ఎంతో బాధ్యత ఉంది. కానీ ఆయన బాధ్యతల నుంచి పారిపోయారు అని పార్వతి విమర్శించింది.
సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల హక్కుల కోసం ఆమె చాలా కాలంగా పోరాటం చేస్తోంది. ఇటీవల విడుదల అయిన “తంగలాన్” చిత్రంలో ఆమె విక్రమ్ భార్యగా నటించి ప్రసంశలు అందుకున్నారు.