ఆగస్ట్ 15 సినిమాల విడుదలకు ముందు రెండు సినిమాలు పకోడీ ఫిలాసఫీ వినిపించాయి. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ “పకోడీ గాళ్లు” అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్ లో రామ్ కూడా “పక్కోడు-పకోడి” అంటూ ఓ డైలాగ్ చెప్పాడు.
ఇప్పుడీ రెండు ఫిలాసఫీలు పనిచేయలేదు. పక్కోడు అభిప్రాయాన్ని పట్టించుకోవద్దని, స్వయంగా సినిమాకు వెళ్లి ఓ అభిప్రాయానికి రావాలని రామ్ పిలుపునిచ్చాడు. కానీ జనం మాత్రం ఈ మాటలు పట్టించుకోలేదు. మిక్స్ డ్ టాక్ వచ్చిన మరుసటి రోజు నుంచి మొహం చాటేశారు.
అటు మిస్టర్ బచ్చన్ విషయంలో కూడా అదే జరిగింది. “పనీపాట లేని చాలామంది పకోడీ గాళ్లు ఇదే పనిమీద ఉంటారు, రూమర్లు పట్టించుకోవద్దు.” అనే డైలాగ్ చెప్పాడు. కానీ మిస్టర్ బచ్చన్ తేడా కొడుతోందనే పుకార్లే నిజమయ్యాయి.
వీళ్ల పకోడీ ఫిలాసఫీలు పక్కనపెడితే.. ఈ రెండు సినిమాలు మంచి వీకెండ్ ను మిస్సయ్యాయి. ఇంకా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత ఇంత మంచి వీకెండ్ మళ్లీ రాలేదు. అలాంటి టైమ్ లో రిలీజైన ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేకపోయింది.