తన తొలి సినిమా హీరోయిన్ ను ప్రేమించాడు కిరణ్ అబ్బవరం. ఆమెతో డేటింగ్ చేశాడు. తాజాగా నిశ్చితార్థం కూడా పూర్తిచేశాడు. ఆమె పేరు రహస్య. ఇప్పుడు వీరి పెళ్లి జరగనుంది. రహస్యని పెళ్లి చేసుకుంటున్నాడు కానీ పెళ్లి రహస్యం కాదు. అలాగనీ అందరినీ పెళ్ళికి పిలవడం లేదు.
డెస్టినేషన్ వెడ్డింగ్ అన్నమాట. ఈ నెల 22వ తేదీన రహస్య మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు కిరణ్ సబ్బవరం. కర్నాటకలోని కూర్గ్ లో పెళ్లి చేసుకోబోతున్నారు కిరణ్, రహస్య. పెళ్లికూతురు రహస్య బంధువులంతా ఎక్కువగా అక్కడే ఉన్నారట.
కిరణ్ సరసన “రాజా వారు రాణి గారు” చిత్రంలో నటించింది రహస్య. “ఆకాశమంత ప్రేమ”, “షర్బత్” వంటి చిత్రాలు కూడా చేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంది. కిరణ్ అబ్బవరం సినిమాల వ్యవహారాల్ని మాత్రం చూసుకుంటోంది.
ప్రస్తుతం ఈ హీరో ‘క’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.