
ఒడిశా రాష్ట్రంలో తెలుగు సినిమా షూటింగ్ ల సందడి ఎక్కువ అవుతోందట. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాజాగా తెలుగు ఫిలింమేకర్లను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిదా (Pravati Parida) ప్రకారం వాళ్ళ రాష్ట్రంలోని మల్కన్ గిరి ప్రాంతంలో పుష్ప 2 షూటింగ్ జరిగిందట. “ఇప్పుడు రాజమౌళి కోరాపుట్ ప్రాంతంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మా ఒడిశాలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు షూటింగ్ లకు అనువుగా ఉన్నాయి,” అని ఆమె పేర్కొన్నారు.
మల్కన్ గిరి, కోరాపుట్ ఒకప్పుడు నక్సల్స్ ప్రాంతాలు. అందుకే, మనవాళ్ళు షూటింగ్ లకు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి, సరస్సులు, జలపాతాలతో ఉంటుంది. సుందరమైన ప్రదేశమే కానీ నక్సల్స్ కారణంగా ఇంతకుముందు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒడిశాలో మరిన్ని పెద్ద సినిమాల షూటింగులు జరుగుతాయా అనేది చూడాలి.